: ఖర్చు పెట్టడంలో మనవారు ఘటికులే... ఏడాదిలో అమెరికాకు వెళ్లి పెట్టిన ఖర్చు రూ. 87,270 కోట్లు
అమెరికాకు వెళుతున్న భారతీయులు అక్కడ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. గత సంవత్సరం మొత్తం 11.7 లక్షల మంది అమెరికాను సందర్శించగా వారు 13.6 బిలియన్ డాలర్లను (సుమారు రూ.87,270 కోట్లు - ఆర్బీఐ శనివారం నాటి రిఫరెన్స్ ఒక డాలర్ కు రూ. 64.1693 లెక్కన) ఖర్చు పెట్టారు. భారతీయులు ఒక ఏడాది వ్యవధిలో అమెరికాలో పెట్టిన ఖర్చులో ఇది సరికొత్త రికార్డు. ఇక అమెరికాకు వెళ్లిన విదేశీయులు పెట్టిన ఖర్చు లెక్కల్లో ఇండియాది ఆరో స్థానం కాగా, పర్యాటకుల సంఖ్య ప్రకారం భారత్ ది 11వ స్థానం. మొత్తం మీద 2016లో 7.56 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు అమెరికాకు వ్యాపారం, వైద్యం, విద్య, పర్యాటకం తదితర వీసాలపై వెళ్లగా, వారంతా 244.7 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు.
యూఎస్ వాణిజ్య శాఖ అధికారుల గణాంకాల ప్రకారం, 2015తో పోలిస్తే భారతీయులు పెట్టిన ఖర్చు పెరుగగా, మొత్తం విదేశీయుల ఖర్చు ఒక శాతం తగ్గింది. ఇక 2009 తరువాత తొలిసారిగా తమ దేశానికి వచ్చిన విదేశీయుల సంఖ్య కూడా తగ్గిందని వాణిజ్య శాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది. అమెరికాకు వెళ్లిన వారిలో సంఖ్య పరంగా, ఖర్చు పరంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. చైనీయులు 33 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టగా, ఆ తరువాతి స్థానంలో మెక్సికో నిలిచింది. మెక్సికన్లు 20.2 బిలియన్ డాలర్లను అమెరికాలో వాడేశారట. ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత మిత్రదేశంగా మారిన దక్షిణ కొరియా నుంచి వచ్చిన సందర్శకుల సంఖ్య 12 శాతం పెరిగినట్టు గణాంకాలు చూపుతున్నాయి.