: సోషల్ మీడియా నయా సెన్సేషన్ 'సరాహ్'... భలే ఉందంటున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు!


సరాహ్... సోషల్ మీడియా ప్రపంచంలో తాజా సెన్సేషన్. చాలా త్వరగా పాప్యులర్ అయిపోయింది. ఈ యాప్ లోడ్ చేసుకుంటే, మెసేజ్ లు పంపినా, వచ్చినా అవి పంపిన వారి వివరాలు తెలియకపోవడమే దీని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే దీన్ని స్మార్ట్ ఫోన్ యూజర్లకు దగ్గర చేసింది. అజ్ఞాత రూపంలో మెసేజ్ లు పంపుతూ, పరిచయం లేని వారి నుంచి స్వీకరిస్తూ ఉండవచ్చు. అంతేకాదు, ఎటువంటి లాగిన్ అవసరం లేకుండానే వాడుకోవచ్చు. బీబీసీ రిపోర్టు ప్రకారం ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాల్లో శరవేగంగా, ఎన్నో దేశాల్లో వేగంగా ఈ యాప్ విస్తరిస్తోంది.

ఈ యాప్ లో రిజిస్టర్ అయి, ప్రొఫైల్ ను సెట్ చేసుకుంటే, అది అందరికీ కనిపిస్తుంది. మీకు ఏదైనా మెసేజ్ పెడితే, అది ఇన్ బాక్స్ లోకి వస్తుంది. దాన్ని చూసిన తరువాత ఎవరు పంపారో తెలిస్తే, వారి పేరును యూజర్ యాడ్ చేసుకోవచ్చు. మెసేజ్ లను ఫ్లాగ్ చేయడం, డిలీట్ చేసుకోవడం, రిప్లయ్ ఇవ్వడం వంటివి చేసుకోవచ్చు. గూగుల్ ప్లేలో శరవేగంగా దూసుకెళుతున్న ఈ యాప్ కు 10 వేలకు పైగా ఫైవ్ స్టార్ రేటింగ్ రివ్యూలు వచ్చాయి. అయితే, ఈ రివ్యూలు రాసిన వారిలో చాలా మంది తమకు తిట్లు, శాపనార్థాలు మెసేజ్ లుగా వస్తున్నాయని చెబుతున్నారు.

ఇక ఈ యాప్ దూసుకెళుతుండటంతో, యూజర్ అనుభూతిని మరింతగా పెంచాలని డెవలపర్లు నిర్ణయించుకున్నారు. ప్రైవసీ ఆప్షన్లు ప్రవేశపెట్టి, సెర్చ్ రిజల్ట్స్ నుంచి ప్రొఫైల్ ను తొలగించడం, ఆడియన్స్ సంఖ్యపై నియంత్రణ, అనాథరైజ్డ్ యూజర్లను బ్లాక్ చేయడం వంటివి చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు యాప్ ను అభివృద్ధి చేసిన టీమ్ చెబుతోంది. తెలియని వారి ప్రొఫైల్ చూసి మెసేజ్ చేయడం, తెలియని వారి నుంచి మెసేజ్ లు అందుకోవడం బాగుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోనూ అందుబాటులో ఉంది. సరాహ్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News