: తండ్రి ఆజ్ఞ మేరకు హైదరాబాద్ లో అజ్ఞాతవాసం... మురికివాడల్లో రూ. 6 వేల కోట్ల సంపదకు వారసుడు!


పాతికేళ్ల కుర్రాడు. గుజరాత్ లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి వారసుడు. దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే అధిపతి. అయితేనేం... తండ్రి ఆజ్ఞ మేరకు ఓ అనామకుడిగా, జేబులో రూ. 500తో హైదరాబాద్ చేరుకుని నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు. తండ్రి సూచించినట్టుగా బతికి చూపించాడు. సామాన్య బతుకు ఎలా ఉంటుందో రుచి చూశాడు. అతని పేరు హితార్థ్. హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ యజమాని ఘన్ శ్యాం డోలాకియా కుమారుడు. నెల రోజుల అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత, అతని సోదరి కృపాలి, పెదనాన్న తదితరులు హైదరాబాద్ రాగా, మొత్తం విషయాన్ని ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియాకు తెలిపారు.

తండ్రి ఇచ్చిన ఫ్లయిట్ టికెట్ జేబులో పెట్టుకుని ఎయిర్ పోర్టుకు వచ్చిన తరువాతే తాను హైదరాబాద్ కు వెళుతున్నానని తెలుసుకున్న హితార్థ్, శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తరువాత బస్సులో సికింద్రాబాద్ చేరుకున్నాడు. రూ. 100కు ఒక హోటల్ లో మంచం తీసుకుని ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు. తాను ఉద్యోగం కోసం వచ్చానని, రైతు కుటుంబీకుడినని చెప్పాడు. ఉద్యోగాలు లభించే ప్రాంతాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో సలహాను ఇవ్వగా, ఓ బస్సు కండక్టర్ సూచన మేరకు అమీర్ పేట వెళ్లి ప్రయత్నించాడు.

తరువాత హైటెక్ సిటీలో ఓ కంపెనీలో చేరి అక్కడ ఇమడలేక, మానేసి మెక్ డీ అనే కంపెనీలో చేరాడు. దాన్నీ మానేసి నైకీలో, ఆడిడాస్ లో వారం చొప్పున పనిచేశాడు. ఆపై సికింద్రాబాద్ లోని వైట్ బోర్డు తయారీ సంస్థలో కుదురుకున్నాడు. కొన్ని రోజులు రిక్షా కార్మికుడితో, మరికొన్ని రోజులు సాధువుతో కలసి ఓ గదిలో బతికాడు. నిత్యమూ రోడ్డు పక్క లభించే ఆహారాన్ని తిన్నాడు. నెల రోజుల తరువాత తానెక్కడున్నానన్న విషయాన్ని వెల్లడించగా, అతని బంధువులంతా ఒక్కసారిగా వాలిపోయి అతని కష్టం చూసి కన్నీరు పెట్టుకున్నారు.

ఇక హైదరాబాద్ తనకెంతో నచ్చిందని, తాను ఓ సాధారణ యువకుడిగా కనిపించలేక పోయానని, అయితే, తనకు తారసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్థ్ వెల్లడించారు. ఉద్యోగం కావాలని చెబితే, ఎంతో మంది సాయం చేయాలని భావించారని, ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు. ఈ నగరం చాలా అందంగా ఉందని, మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు. కాగా, హితార్థ్ సోదరుడు గతంలో ఇదే విధంగా అజ్ఞాతవాసం చేసి కేరళలో కూలీగా పనిచేస్తూ నెల రోజులు గడిపాడు.

  • Loading...

More Telugu News