: అమ్మవారికి లక్షలాది రూపాయలు, కిలోకి పైగా బంగారం సమర్పించిన భక్తుడు!
బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కె. సూర్యనారాయణ తన ఇంట్లో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి సమర్పించిన కానుకలు, బంగారం గురించి చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. రూ.88 లక్షలు, 1.23 కిలో బంగారాన్ని అమ్మ వారికి సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సదరు రియల్టర్ సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్ గా మారింది. దీంతో, అదంతా నల్లధనమంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు మిర్రర్ అనే ఆంగ్ల పత్రికతో సూర్యనారాయణ మాట్లాడుతూ, అమ్మవారికి సమర్పించిన డబ్బుల్లో ప్రతి పైనా తన కష్టార్జితమని, అవసరమైతే ఆధారాలు కూడా చూపిస్తానని అన్నారు. ‘నా దగ్గర నల్లధనం ఉందని ప్రజలు అంటున్నారు. వాస్తవం ఏంటంటే, ప్రతి పైసాకు నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. 2002 నుంచి నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ సొమ్ము. ఇప్పటివరకు నేను 40 ఇళ్లు నిర్మించి ఉంటాను. నేను రియల్ ఎస్టేట్ డెవలపర్ ను.. చాలా ఇళ్లు నిర్మించాను. రూ.15 కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించి ఈ ఏడాది పన్ను కింద రూ.13 లక్షలు చెల్లించాను. ప్రతి ఏటా మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ చేయడటం పరిపాటి. మా ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బు డ్రా చేస్తుంటాం. ఈ ఏడాది కూడా అదే విధంగా డబ్బు డ్రా చేశాం’ అని చెప్పారు. బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీలో పని చేసే సూర్యనారాయణ లైసెన్స్డ్ బ్రోకర్ అని సమాచారం.