: చివరికి హీరోనే గెలుస్తాడు... చంద్రబాబుకి ఉరిశిక్ష విధించినా తక్కువే: నంద్యాలలో జగన్
ఏ సినిమా చూసినా మొదటి నుంచి క్లైమాక్స్ వరకు ప్రతినాయకుడిదే విజయం ఉంటుందని, అంతిమ విజయం మాత్రం హీరోదేనని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేగాక, భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏది చదివినా అన్యాయం చేసేవారిదే చివరివరకు పై చేయిగా ఉండి, అంతిమంగా మాత్రం న్యాయం, ధర్మమే గెలుస్తాయని తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా చివరికి విజయం మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
ఈ రోజు నంద్యాల లోని పోలూరులో ఆయన మాట్లాడుతూ.... ఇసుక, మట్టి, గుడి భూములు, రాజధాని భూమి ఇలా దేన్నీ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టలేదని, అన్నింట్లో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడని అన్నారు. మూడేళ్ల నుంచి అన్యాయం రాజ్యమేలుతోందని, ప్రజలు ఓటుతో ఆ పాలనకు చరమగీతం పాడాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన నేరాలు, మోసాలకు ఉరిశిక్ష విధించినా తక్కువేనని అన్నారు. మాట తప్పిన వారిని ప్రజలు కాలర్ పట్టుకుని నిలదీస్తారని అన్నారు.