: పంద్రాగస్టు ప్రసంగం గురించి ప్రధాని మోదీకి సలహాల వెల్లువ!
`మన్ కీ బాత్` వేదికగా గతవారం ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున తాను ఎర్రకోట నుంచి మాట్లాడాల్సిన అంశాల గురించి సలహాలు ఇవ్వమని శ్రోతలను కోరిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నరేంద్రమోదీ యాప్, మైగవ్.ఇన్ పోర్టల్‌ల ద్వారా కూడా ఆయన విన్నవించుకున్నారు. దీంతో వేల కొద్ది సలహాలు వెల్లువలా వస్తున్నాయని ప్రసార, సమాచార శాఖ అధికారులు తెలియజేశారు.
ఇప్పటివరకు నరేంద్రమోదీ యాప్ ద్వారా 6వేల సలహాలు, పోర్టల్ ద్వారా 2వేలకి పైగా సలహాలు వచ్చాయని వారు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ మంది విద్య, ఉద్యోగం, పర్యావరణం, డిజిటలైజేషన్, స్వచ్ఛ్ భారత్, భేటీ బచావో.. భేటీ పడావో అంశాలపై మాట్లాడాలని సలహాలు వచ్చినట్లు తెలుస్తోంది. తన ద్వారా భారత ప్రజల మాటలు ప్రసంగంలో వినిపించడానికి సహకరించమని ప్రధాని రేడియో కార్యక్రమంలో కోరారు. ఈ సారి తన ప్రసంగం 40-45 నిమిషాలు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.