: దేవుడా! నా సోదరిని ఎందుకంత త్వరగా తీసుకెళ్లావు?: నాటి బాలీవుడ్ నటి మధుబాల సోదరి మధుర్
అలనాటి నటి, ‘వీనస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్’ గా పేరు గాంచిన మధుబాల మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించడంపై ఆమె సోదరి మధుర్ బ్రిజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఒకవైపు సంతోషంగా, మరోవైపు బాధగానూ ఉంది. మధుబాల మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషమే, కానీ, ఆమెను అంత త్వరగా దేవుడు తీసుకుపోవడం బాధాకరం. ఆ దేవుడు కనుక కనిపిస్తే, ఆమెను ఎందుకంత త్వరగా తీసుకెళ్లావని ప్రశ్నిస్తాను’ అంటూ మధుర్ భావోద్వేగం చెందారు.
ఈ సందర్భంగా తన సోదరి విగ్రహం పక్కనే నిలబడి ఫొటోకు పోజిచ్చారు. అలాగే, ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా మధుర్ ప్రస్తావించారు. మధుబాల పోలికలు బాలీవుడ్ నటి కరీనాకపూర్ కు ఉంటాయని, మధుబాలపై కనుక బయోపిక్ తీస్తే ఆ పాత్రలో కరీనా కపూర్ నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మధుబాలపై బయోపిక్ తీస్తే మాధురి దీక్షిత్ నటిస్తే బాగుంటుందని ఒకప్పుడు అనుకునే దానినని, కానీ, కరీనా అయితే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తోందని చెప్పారు. మధుబాల లాగే కరీనాకపూర్ కూడా చాలా అందంగా ఉంటుందని మధుర్ అభిప్రాయపడ్డారు. కాగా, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మధుబాల విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించారు. అనారోగ్య కారణాలతో 1969లో మధుబాల మృతి చెందారు.