: ముంబైలో క‌లుషిత నీటిని తాగి నీలి రంగులోకి మారుతున్న కుక్క‌లు!


నవీ ముంబైలోని తాలోజా పారిశ్రామికవాడ‌లో ఉన్న కుక్క‌ల శ‌రీరం నీలి రంగులోకి మారుతోంది. అక్క‌డి కాసాడి న‌దిలోని ప‌రిశ్ర‌మ‌ల వ్య‌ర్థాలు క‌లిసిన నీటిని తాగ‌డం వ‌ల్లే ఇలా అవుతోంద‌ని నవీ ముంబై జంతుసంర‌క్ష‌ణ కేంద్రం అభిప్రాయ‌ప‌డుతోంది. ఆ ప్రాంతంలో దాదాపు 1000కి పైగా ఉన్న ప‌రిశ్ర‌మ‌లు, త‌మ‌ వ్య‌ర్థాల‌ను స‌రాస‌రి కాసాడి న‌దిలోకి పంపిస్తున్నాయి. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల అక్క‌డి కుక్క‌ల శ‌రీరం నీలి రంగులోకి మారుతోంద‌ని స్థానికులు మ‌హారాష్ట్ర పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డుకి ఫిర్యాదు చేశారు.

విచార‌ణ కోసం వ‌చ్చిన జంతుసంర‌క్ష‌ణ కేంద్రం అధికారులు అక్క‌డి కుక్క‌ల ప‌రిస్థితి చూసి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. `మొద‌ట ఈ మూగ‌జీవుల ప‌రిస్థితి చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఈ ప్రాంతంలో నీలిరంగులోకి మారిన కుక్క‌లు దాదాపు ఐదు వ‌ర‌కు క‌నిపించాయి. దీనికి న‌దిలో ఉన్న క‌లుషిత నీరే కార‌ణం` అని జంతుసేవ‌కురాలు ఆర్తి చౌహాన్ తెలిపారు. గ‌తంలో ఈ న‌దిలో చేప‌లు కూడా రంగు మారి చ‌నిపోవడాన్ని గుర్తించిన‌ట్లు స్థానికులు చెప్పారు. ఈ నీరు వ‌ల్ల మ‌నుషుల ఆరోగ్యానికి కూడా ప్ర‌మాదం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, వీలైనంత త్వ‌రగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరారు.

  • Loading...

More Telugu News