: ‘ట్యూబ్ లైట్’ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న సల్మాన్!
ఈ ఏడాది జూన్ లో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన హిందీ చిత్రం ‘ట్యూబ్ లైట్’. కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్, ఓంపురి, సొహైల్ ఖాన్, ఝూఝూ తదితరులు నటించారు. ప్రేక్షకులను ఆకర్షించలేక, కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారికి నష్టపరిహారం కింద కొంత మొత్తాన్ని చెల్లిస్తానని సల్మాన్ ఖాన్ ఇటీవలే హామీ ఇచ్చాడు.
ఇచ్చిన మాట ప్రకారం, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు సుమారు రూ. 35 కోట్లు ఈ రోజు సల్మాన్ చెల్లించనున్నట్టు సమాచారం. ‘ట్యూబ్ లైట్’ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నష్టపోయిన మొత్తంలో సగం సొమ్మును సల్మాన్ చెల్లించనున్నాడు. జూన్ 23న విడుదలైన ‘ట్యూబ్ లైట్’ ఓపెనింగ్స్ రూ.21.15 కోట్లతో మొదలైంది. మొదటి వారాంతంలో ఈ చిత్రం రూ.64.77 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
దీంతో, ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందని ఆశించిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు నిరాశ ఎదురైంది. దీంతో, తాము నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ వారికి నష్టపరిహారం చెల్లిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్నాడు. ఆ నష్టపరిహారాన్ని జులై నెలాఖరుకే సల్మాన్ అందజేయాల్సి ఉంది కానీ, 2017 ఐఐఎఫ్ఏ అవార్డ్స్ కార్యక్రమంలో ఇన్నిరోజులు బిజీగా గడపడంతో వీలుపడలేదట.