: అమ్మాయిలూ కావాలి... గూగుల్ లో మీకూ చోటుందన్న సుందర్ పిచాయ్
మహిళా ఉద్యోగులపై గూగుల్ ఉన్నతోద్యోగి ఒకరు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన వేళ, నష్ట నివారణకు స్వయంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ రంగంలోకి దిగారు. "మీకందరికీ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ పరిశ్రమలో మహిళాశక్తికి స్థానముంది. మాకూ అమ్మాయిలు కావాలి. గూగుల్ లో మీకూ చోటుంది" అని పిచాయ్ వ్యాఖ్యానించినట్టు 'ది వర్జ్' పత్రిక పేర్కొంది.
కాగా, గురువారం నాడు జరగాల్సిన గూగుల్ టౌన్ హాల్ సమావేశం రద్దయిన నేపథ్యంలో పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు ఎదురైన అనుభవాలను చెప్పి, ప్రశ్నిస్తే, తాము టార్గెట్ గా ఆన్ లైన్ వేధింపులు ప్రారంభమవుతాయని కొందరు ఉద్యోగులు ఆందోళనను వ్యక్తం చేయగా, ఈ సమావేశాన్ని గూగుల్ రద్దు చేసుకుంది. సంస్థలో ఇటీవలి కాలంలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల జీవనాన్ని మరింత సరళీకృతం చేసేలా కొత్త ప్రొడక్టులను కనుగొని వాటిని అందించడంపైనే గూగుల్ దృష్టిని సారిస్తుందని, మిగతా విషయాలపై ఎంత మాత్రమూ దృష్టిని పెట్టబోమని ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.