: ఈ పోలీస్ అంకుల్ అందరినీ కొట్టారు... న్యాయమూర్తి ముందు సాక్ష్యమిచ్చి ఐపీఎస్ నోట మాట లేకుండా చేసిన ఏడేళ్ల బుడతడు!
ఇటీవల కేరళలోని పుదియతోప్ ప్రాంతంలో ఎల్పీజీ ప్లాంటు వద్దని స్థానికులు ఆందోళనకు దిగిన వేళ, తన బలగాలతో డీసీపీ యతీశ్ చంద్ర అక్కడికి చేరుకుని విచక్షణా రహితంగా దాడులు జరిపించారన్న ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టిన వేళ, ఓ ఏడేళ్ల బుడతడు, న్యాయమూర్తి ముందు సాక్ష్యమిచ్చి యతీశ్ కు షాకిచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుదియతోప్ ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిషన్ ఓ నిజ నిర్ధారణ బృందాన్ని పంపింది.
ఈ సందర్భంగా తాను ఎవరినీ కొట్టలేదని, ఉద్యోగ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించానని యతీశ్ వెల్లడించిన వేళ, తన తల్లిదండ్రులతో కలసి వచ్చిన ఏడేళ్ల బాలుడు, జడ్జి ముందు నిలబడి, "ఆ అంకుల్ అందర్నీ కొట్టాడు. మర్నాడు పేపర్ లో కూడా అతని ఫోటో వచ్చింది" అని చెప్పాడు. దీంతో షాక్ తిని కాసేపు మౌనంగా ఉన్న యతీశ్, ఆపై తేరుకుని, "నేను కొట్టానా?" అని ప్రశ్నించాడు. దానిపై బాబు స్పందిస్తూ, "అవును... నువ్వే కొట్టావు" అని సమాధానమిచ్చాడు. అనంతరం యతీశ్ మాట్లాడుతూ, ఈ బాలుడికి మంచి తర్ఫీదు ఇచ్చి తీసుకు వచ్చారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులను తాను బాగా చూసుకున్నానని చెబుతూ, అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను ఆయన కమిషన్‌కు అందించాడు. ఆపై విచారణను వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది.