: ఇదో వెర్రి: స్నేహితుని పుట్టినరోజు జ్ఞాపకం కోసం 100 కార్ల అద్దాలు పగులగొట్టారు!
స్నేహితుని పుట్టినరోజును ప్రత్యేకంగా జరపాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగని తప్పుడు పనులు చేస్తే జైలు పాలు కావాల్సివస్తుంది. రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందిన ఐదుగురు విద్యార్థులు తమ స్నేహితుని పుట్టినరోజు జ్ఞాపకార్థం వందకు పైగా కార్ల అద్దాలను పగుల గొట్టారు. సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆగస్టు 4న తమ స్నేహితుడు నరేంద్ర యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా రాత్రి ఒంటి గంట వరకు ఐదుగురు స్నేహితులు కలిసి బాగా మందు కొట్టారు. అప్పటికీ ఎలాంటి ఆనందం లభించకపోవడంతో ఓ ఇనుప రాడ్ తీసుకుని కాలనీల్లో పార్క్ చేసిన కార్ల అద్దాలను పగులగొట్టడం ప్రారంభించినట్లు అరెస్టైన విద్యార్థులు విచారణలో తెలియజేశారు. ఆరోజు రాత్రి ఆరు కాలనీల్లో దాదాపు 100కి పైగా కార్ల అద్దాలను వీరు పగుల గొట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని అల్వార్ అదనపు ఎస్‌పీ పరాస్ దేశ్‌ముఖ్ తెలిపారు.