: అమెరికా, కొరియా భయం... బేర్ మన్న మార్కెట్, దూసుకెళ్లిన బంగారం ధర!


కొరియా, అమెరికాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో పలు కంపెనీలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. అమెరికా అధీనంలోని గువామ్ ద్వీపంపై తాము దాడులు చేస్తామని కొరియా ప్రకటించడం, దానిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరుగగా, నిన్నటి అమెరికా మార్కెట్లతో పాటు, నేటి ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుద్ధం రావచ్చన్న ఆందోళనలో ఉన్న ఇన్వెస్టర్లు నూతన కొనుగోళ్లకన్నా, విక్రయాలవైపే మొగ్గుచూపుతున్నారు. గత వారంలో 10 వేల మార్కును దాటిన నిఫ్టీ, శుక్రవారం నాడు కీలకమైన 9,750 పాయింట్ల స్థాయి వద్ద సైతం మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది.

ఈ ఉదయం 11.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 31,330 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో 9,748 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే, గురువారం నాడు రెండు శాతానికి పైగా నష్టపోయిన నాస్ డాక్, నేటి ఫ్యూచర్లలో ఒక శాతానికి పైగా నష్టాన్ని చూపుతోంది. ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.1 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.32 శాతం, హాంగ్ సెంగ్ 2 శాతం, కోస్పీ 1.8 శాతం, షాంగై కాంపోజిట్ 1.5 శాతం నష్టపోయాయి.

ఇదిలావుండగా, మార్కెట్లు నష్టాల్లో ఉన్న వేళ, తమ పెట్టుబడులు బులియన్ మార్కెట్లో సురక్షితంగా ఉంటాయని భావిస్తున్న ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకు వెల్లువెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర మరో రూ. 300కు పైగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 29.,230 వద్ద ఉండగా, వెండి ధర కిలోకు రూ. 40 వేల వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్ ధర కూడా పడిపోయింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ 19 పైసలు పడిపోయి రూ. 64.34 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News