: ఇక్కడ తన్నుకున్నాం, తిట్టుకున్నాం... బయటకు వెళ్లి ముచ్చట్లాడాం: గతాన్ని గుర్తు చేసుకున్న గులాం నబీ ఆజాద్
ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి, రాజ్యసభ చైర్మన్ స్థానాన్ని అలంకరించిన వెంకయ్యనాయుడుకు ఈ సభ కొత్తదేమీ కాదని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ మాట్లాడిన ఆజాద్, సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు సభకు సుపరిచితుడని గుర్తు చేశారు. ఎన్నో మార్లు పలు విషయాల్లో సభలో తన్నుకున్నామని, తిట్టుకున్నామని, అది సభ వరకూ మాత్రమే పరిమితమని, ఆపై బయటకు వెళ్లిన తరువాత ముచ్చట్లు పెట్టుకున్నామని ఆజాద్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఎంతో స్నేహశీలిగా ఉండే వెంకయ్యనాయుడి నేతృత్వంలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను సభ తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు. వెంకయ్యనాయుడితో తనకు సుదీర్ఘకాల పరిచయం ఉందని తెలిపారు. అధికార, విపక్ష సభ్యులంటూ గీతలు గీయకుండా సభను నడిపిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.