: వెంకయ్య నాయుడు గారూ! మీరు తెలుగులో సహజసిద్ధంగా మాట్లాడుతుంటే మజా అనిపిస్తుంది: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆకాశానికెత్తారు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో కూర్చున్న వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షల ప్రసంగం సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశంలోని వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరని అన్నారు. ఆయన ప్రతిభ అనన్యసామాన్యమని అన్నారు. రైతు బిడ్డగా ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, పార్టీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని అన్నారు.
ఇదే సభలో పెరిగిపెద్దవాడైన వెంకయ్యనాయుడు ఇదే సభకు నాయకుడిగా రావడం ఆనందకరమని అన్నారు. వెంకయ్యనాయుడు ఏం మాట్లాడినా బాగుంటుందని ఆయన చెప్పారు. అదే వెంకయ్యనాయుడు తెలుగులో మాట్లాడుతుంటే మాత్రం అనర్గళంగా మాటల మంత్రమేసినట్టు ఉంటుందని అన్నారు. అప్పుడు ఆ మాటల వేగం చూసి మజా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో మంది జాతీయ స్థాయి నాయకులతో వెంకయ్యనాయుడు పని చేశారని, ఆయనకు అభినందనలని అన్నారు. సభలో ఎంతో అనుభవమున్న వెంకయ్యనాయుడు సభను సమర్థవంతంగా నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.