: రాజ్యసభ చైర్మన్ సీటులో కూర్చున్న వెంకయ్యనాయుడు!
ఈ ఉదయం భారత ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆపై రాజ్యసభకు వచ్చి చైర్మన్ స్థానంలో తొలిసారిగా కూర్చుని సభను నడిపించారు. రాజ్యసభ చైర్మన్ గా సభకు వచ్చిన ఆయనకు పలువురు బీజేపీ ఎంపీలు, మంత్రులు విపక్ష పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టిన వ్యక్తి తొలిసారిగా ఉప రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేశారు. విద్యార్థి దశలోనే తనలోని నాయకత్వ లక్షణాలను బయటకు తెచ్చిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. వ్యక్తిత్వ వికాసానికి పదును పెట్టుకుంటూ, రాజకీయ క్షేత్రంలో రాణిస్తూ వచ్చారని, ఇప్పుడు దేశ అత్యున్నత పదవుల్లో ఒకదాన్ని అధిరోహించారని అన్నారు.
ఓ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా వెంకయ్యతో ఎన్నో సంవత్సరాలు కలసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. తనకు ఎన్నో మార్లు విలువైన సలహాలు, సూచనలు అందించారని, పట్టణాభివృద్ధికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదం చేశాయని మోదీ వివరించారు. తన శాఖకు సంబంధించిన విషయాలను చర్చించే సమయంలో తమకు మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారు కాదని, గ్రామీణాభివృద్ధి శాఖపైనా ఆయనకు ఎంతో పట్టుందని చెప్పుకొచ్చారు. రాజ్యసభను ఆయన సమర్థవంతంగా నడిపించగలరన్న నమ్మకం తనకుందని తెలిపారు.