: చంద్రబాబుకు రిలీవర్ గా అచ్చెన్న... టీడీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. పాలనా వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్న ఆయన అలసటకు గురవుతున్నారు. దీంతో, చంద్రబాబుపై పని ఒత్తిడిని తగ్గించేందుకు ఓ అంబుడ్స్ మెన్ ఉండాలనే విషయంపై టీడీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖరరెడ్డి కూడా క్షణం తీరికలేకుండా ఉండేవారు. దీంతో, ఆయన ఇతర ప్రాంతాల పర్యటనకు వెళ్లేటప్పుడు తన ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు అన్ని విషయాలను వివరించి చెప్పేవారు. ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను ఆయన బ్రీఫ్ చేసేవారు. వైయస్ ను కలవలేని వారు కేవీపీని కలిసేవారు. ఆ తర్వాత 24 గంటల్లో వైయస్ నుంచి స్పందన వచ్చేది.
ఇప్పుడు చంద్రబాబుకు కూడా అలాంటి ఒక వ్యక్తి అండగా ఉంటే... ఆయనకు కొంచెం రిలీఫ్ గా ఉంటుందనే విషయంపై టీడీపీ నేతలు చర్చించారు. ఈ నేపథ్యంలో పొడగరి, గంభీరమైన స్వరం ఉండే అచ్చెన్నాయుడైతే ఈ పాత్రను సమర్థవంతంగా పోషించగలరని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. మిగతా నేతలు కూడా ఈ సూచనను సమర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కల్పించుకుని... ఇదంతా చూస్తుంటే అచ్చెన్నకు ఎర్త్ పెడుతున్నట్టు కనిపిస్తోందంటూ చమత్కరించారు.
ఏదేమైనప్పటికీ చంద్రబాబుపై ఒత్తిడి తగ్గించేందుకు ఓ వ్యక్తి ఉండాలని అందరూ అభిప్రాయపడ్డారు. అప్పుడు చంద్రబాబుకు పని ఒత్తిడి తగ్గుతుందని, పార్టీ వ్యవహారాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎలక్షన్ మేనేజ్ మెంట్ పై చంద్రబాబు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని... పార్టీ నేతలతో ఆయన ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. చర్చ ముగిసిన తర్వాత 'అంబుడ్స్ మెన్ అచ్చెన్నాయుడు' అంటూ జోక్ చేసుకుంటూ వారు బయటకు వచ్చారు.