: బుద్ధి లేని జగన్ కు వయసు కూడా కనిపించదా?: జేసీ నిప్పులు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని బుద్ధున్నవారెవరూ కాల్చండి, ఉరితీయండి అంటూ మాట్లాడరని తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ పై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు వయసు, హోదాకైనా జగన్ గౌరవం ఇస్తే బాగుంటుందని హితవు పలికిన ఆయన, జగన్ వైఖరిని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆదరించక, నంద్యాల ఎన్నికల్లో వైకాపా ఓడిపోతే, ఓట్లు వేయని ప్రజలను కూడా ఆయన బుద్ధిలేని వాళ్లని అనేట్టు కనిపిస్తున్నారని జేసీ విమర్శించారు. జగన్ కు బుద్ధి లేదన్న విషయం అందరికీ తెలిసిపోయిందని, ఇతరుల వయసు, పెద్దరికం కూడా కనిపించక పోవడం శోచనీయమని అన్నారు. జగన్ తన ఉన్మాదాన్ని తగ్గించుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు.