: పూరి గుడిసెకు రూ.90 వేల విద్యుత్ బిల్లు.. ఎలా చెల్లించాలో తెలియక ఆగిన ఇంటి యజమాని గుండె!
కరెంటు బిల్లు ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉండేది పూరి గుడెసె అయినా వచ్చిన బిల్లు మాత్రం లక్షల్లో కావడంతో అంత డబ్బు ఎలా చెల్లించాలా? ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక ఇంటి యజమాని గుండె హఠాత్తుగా ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గిలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన బాబుమియా (60) భార్య బిపాష, ఇద్దరు కుమారులతో కలిసి చిన్న గుడిసెలో నివసిస్తున్నాడు. రెండు రోజుల క్రితం విద్యుత్ సిబ్బంది వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుని రూ.90 వేల బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అది చూసిన బాబుమియా గుండె గుభేల్‌మంది!
అంత డబ్బును ఎలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అదే విషయాన్ని ఆలోచిస్తూ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. విద్యుత్ శాఖ నిర్వాకం వల్లే బాబుమియా ప్రాణాలు పోయాయని, అతడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గ్రామంలోని దాదాపు వందకుపైగా కుటుంబాలకు రూ.90 వేల బిల్లు రావడంతో విద్యుత్ సిబ్బంది వాటిని ఇవ్వకుండానే వెళ్లిపోయారు. సాంకేతిక లోపం కారణంగా బిల్లు పెద్దమొత్తంలో వచ్చిందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.