: జగన్ మరోసారి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేస్తాం: సోమిరెడ్డి


ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబుని జ‌గ‌న్‌ చెప్పుల‌తో కొట్టాల‌ని మాట్లాడారని, నిన్న కాల్చేయాల‌న్నారని, ఇప్పుడు ఉరితీయాలంటున్నారని అన్నారు. ఇటీవ‌లే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటీసులు ఇస్తే ఏదో ఆవేశంలో మాట్లాడాన‌ని జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చార‌ని అన్నారు. మ‌ళ్లీ ఈ రోజు అటువంటి వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్పారు. జ‌గ‌న్‌కు బుద్ధి రావ‌డం లేద‌ని అన్నారు. శాంతియుతంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం జ‌గ‌న్‌కు ఇష్టం లేదని సోమిరెడ్డి అన్నారు.

ఓట‌మి భ‌యంతోనే జ‌గ‌న్‌ ఇలా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ ఈ రోజు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు. బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ ఏ నాయ‌కుడూ ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదని అన్నారు. ప్ర‌జ‌లను మోసం చేస్తోంది జ‌గ‌నేన‌ని వ్యాఖ్యానించారు. పారదర్శక‌మైన పాల‌న అందిస్తోన్న టీడీపీపై ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News