: ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళ పెళ్లిలో తోడు పెళ్లికూతురిగా వివాదాస్పద దర్శకురాలు దివ్య భారతి
టాయ్‌లెట్ క్లీనర్లుగా పనిచేసే వారి జీవితంపై `కక్కూస్ (టాయ్‌లెట్)` అనే సినిమా తీసి విమర్శల పాలైన దర్శకురాలు దివ్య భారతిని తన పెళ్లిలో తోడుపెళ్లికూతురిగా తన పక్కనే ఉండాలని ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళ ఆహ్వానించారు. ఈనెల 16న బ్రిటన్‌కు చెందిన డెస్మండ్ కౌటిన్హోను షర్మిళ పెళ్లిచేసుకోనున్నారు. సామాజిక కార్యకర్త అయి ఉండి ఆమె ఓ విదేశీయుణ్ని, ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకోవడంపై చాలా మంది వ్యతిరేకత చూపిస్తున్నారు.
ఈ విషయంపై కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. మణిపూర్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇరోమ్ షర్మిళ కొడైకెనాల్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె పెళ్లిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొడైకెనాల్ లో మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని హిందూ మక్కల్ కచ్చి సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవన్నీ పట్టించుకోకుండా కుల వ్యవస్థను తూలనాడుతూ `కక్కూస్` సినిమా తీసిన దివ్యభారతిని తోడుపెళ్లికూతురిగా ఆమె ఆహ్వానించడం గమనార్హం.