: చైనా సరిహద్దులో ప్రజలను వేరే ప్రాంతానికి తరలిస్తోన్న భారత సైన్యం!
భారత్, చైనాల మధ్య రాజుకుంటున్న ‘డోక్లామ్’ వివాదం నేపథ్యంలో చైనా అధికారిక మీడియా యుద్ధం చేస్తాం అంటూ ప్రచురిస్తోన్న కథనాలు అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. 50 రోజుల నుంచి ఇరు దేశాల సైన్యం అక్కడి నుంచి కదలడం లేదు. ఈ నేపథ్యంలో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కునేందుకు భారత్ అన్ని విధాలా సిద్ధమవుతోంది. డోక్లామ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. డోక్లామ్ సరిహద్దుకు కేవలం 35 కి.మీ దూరంలో నతాంగ్ అనే గ్రామం ఉంటుంది.
ఆ గ్రామంలో జనాభా తక్కువగానే ఉంటుంది. ఆ గ్రామంలోనే ఉండి భారత సైన్యం పహారా కాయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఆ గ్రామస్తులను ఖాళీ చేయించిన అంశంపై ఓ అధికారి మాట్లాడుతూ... వచ్చేనెలలో జరిగే వార్షిక సైనిక విన్యాసాల కోసం ఆ గ్రామస్తులను తరలించినట్లు చెబుతున్నారు. భారత్‌పై యుద్ధం చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ చైనా పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా ఉంది. డోక్లామ్ సరిహద్దులో ఉన్న సైన్యాన్ని భారత్ ఉపసంహరించుకోవాలని చైనా చేస్తోన్న బెదిరింపులకు భారత్ ఏ మాత్రం బెదరడం లేదు.