: ఇండియాను నిత్యమూ రెచ్చగొడుతున్న చైనా: యూఎస్
భారత్, భూటాన్, చైనా సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ ప్రాంతమైన డోక్లామ్ లో కొనసాగుతున్న అనిశ్చితిపై యూఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకు వైఖరితో నిత్యమూ ఇండియాను రెచ్చగొడుతోందని ఇల్లినాయిస్ కాంగ్రెస్ మెన్ రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. డోక్లామ్ ప్రాంతంలో ఏం జరుగుతుందన్న విషయం తనకు తెలుసునని, ప్రస్తుత ఉద్రిక్తతలకు చైనాయే కారణమని అన్నారు. ఇటీవలే ఇండియాలో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోదీతో సైతం పలు అంశాలను చర్చించి వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, తాను భారత పర్యటనలో ఉన్నప్పుడు ఈ విషయం వెలుగులోకి రాలేదని అన్నారు. ఈ విషయంలో దౌత్య పరమైన పరిష్కారాన్ని కనుగొనాలని, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కాగా, ఇండియా సరిహద్దుల గురించి వస్తున్న వార్తలను తాము చూశామని, ఈ విషయంలో భారత్, చైనా, భూటాన్ ప్రభుత్వాలకు మరింత సమాచారాన్ని ఇవ్వాలని కోరామని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చైనా ఈ ప్రాంతంలో నిర్మించాలని భావిస్తున్న రహదారి ఆలోచన వెనుక భారత్ ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలన్న కుయుక్తి దాగుందని ఆసియా పసిఫిక్ డిఫెన్స్ అనలిస్ట్ విల్ ఎడ్వర్డ్స్ వ్యాఖ్యానించారు. ఇక్కడ భారత్ కు ఈశాన్య రాష్ట్రాలను కలిపేందుకు చాలా తక్కువ భూభాగం ఉందని గుర్తు చేసిన ఆయన, ఇటువంటి బాటిల్ నెక్ ప్రాంతంలో చైనా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, భారత్ అడ్డుకుంటోందని అన్నారు. చైనా ఇక్కడ రోడ్డును నిర్మిస్తే, మరింత భూభాగం తమదేనంటూ చొచ్చుకు వచ్చే అవకాశాలు పుష్కలమని అభిప్రాయపడ్డారు.