: ఏపీ రాజధాని అమరావతి కాదు.. నంద్యాలే అన్నట్టుగా ఉంది: జోగి రమేష్
నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందని వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులంతా నంద్యాలలోనే తిష్ట వేశారని ఎద్దేవా చేశారు. కేవలం ఓట్ల కోసమే నంద్యాల ప్రజలపై చంద్రబాబు లేని ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు. మంత్రులంతా నంద్యాలలోనే కనపడుతుండటంతో... ఏపీ రాజధాని అమరావతి కాదు, నంద్యాలే అనే విధంగా పరిస్థితి తయారైందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బు ఆశ చూపుతున్నారని... డబ్బులు తీసుకుని ఓటు వేసే పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తమ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను చేయడం దారుణమని అన్నారు. జగన్ పై ప్రజలకు చాలా నమ్మకం ఉందని... నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని తెలిపారు.