: హృదయ విదారకం... స్టేడియంలో కరెంట్ షాక్ తో జాతీయ రెజ్లర్ విశాల్ కుమార్ దుర్మరణం
ఇప్పుడిప్పుడే ఎదుగుతూ సత్తా చాటుతున్న జాతీయ స్థాయి రెజ్లర్ జీవితం అర్థాంతరంగా ముగిసింది. తాను నిత్యమూ ప్రాక్టీస్ చేసే స్టేడియంలోనే విద్యుత్ షాక్ తో ఆయన ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసింది. జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ అధీనంలోని స్టేడియంలో వర్షపు నీరు చేరడం, షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహిస్తుండటం, విషయం తెలీని 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ ప్రాణాలను బలిగొన్నాయి. నీటిలో అపస్మారక స్థితిలో పడివున్న విశాల్ ను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా నాథ్ సింగ్ తెలిపారు. నిండా నీటిలో మునిగివున్న స్టేడియం కార్యాలయంలోకి ఆయన ఎందుకు వెళ్లాడో తెలియడం లేదని అన్నారు. తక్షణ సాయంగా ఆయన కుటుంబానికి రూ. లక్ష, ఆయన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకూ నెలకు రూ. 10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. కేంద్ర క్రీడాశాఖ నుంచి రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, 2005లో కెరీర్ ను ప్రారంభించిన విశాల్, ఇటీవలి జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో సెమీ ఫైనల్స్ వరకూ వచ్చారు.