: నారాయణ కాలేజ్ లో దారుణం...కింద అంతస్తులో ఫీజు చెల్లిస్తున్న తండ్రి...పై అంతస్తులో ఉరేసుకున్న కుమార్తె!
హైదరాబాదులోని బండ్లగూడలోని నారాయణ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. కింది అంతస్తులోని కళాశాల ఆఫీసులో తండ్రి ఫీజు చెల్లిస్తుండగా, అదే భవనంలోని పై అంతస్తులో ఆయన కుమార్తె ఉరి వేసుకొన్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన పబ్బు వెంకటేశం, దుర్గమ్మల రెండో కుమార్తె శ్రావ్య (16) నాగోల్ సమీపంలోని బండ్లగూడలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వెళ్లింది. అక్కడ ఆనందంగా గడిపిన శ్రావ్యను తండ్రి కళాశాలకు తీసుకొచ్చాడు. ఫీజుకట్టాల్సి ఉండటంతో తండ్రి కింది అంతస్తులోని ఫీజు కౌంటర్ వద్దకు వెళ్లాడు.
అక్కడ సిబ్బంది లేకపోవడంతో సుమారు 40 నిమిషాలు వెంకటేశం అక్కడే ఉండిపోయాడు. ఇంతలో కళాశాల ఆవరణలోకి అంబులెన్సు రావడాన్ని గమనించి ఎవరికో బాలేదోమోనని అందర్లాగే వెంకటేశం కూడా ఆసక్తిగా గమనించాడు. ఇంతలో కళాశాల సిబ్బందితో కలిసి విద్యార్థినులు ఒక బాలికను అంబులెన్స్ లోకి ఎక్కించడం చూసి పరుగున వెళ్లాడు. చూస్తే ఆ బాలిక తన కుమార్తె శ్రావ్య కావడంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఆసుపత్రికి చేరేసరికే ఆమె ప్రాణం కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.