: హర్యానా బీజేపీ చీఫ్ కుమారుడి అరెస్టు... కొత్త కథనం వినిపించిన పోలీసులు!
ఛండీగఢ్ లో యువతిని వెంటాడి వేధించిన కేసులో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాశ్ బరాలను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుందును కారులో వెంబడించి, వేధించి, కిడ్నాప్ కు ప్రయత్నించిన ఘటన పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులు బాధితురాలు ఫేస్ బుక్ లో ఘటన వివరాలు పోస్టు చేయడంతో వికాశ్ ను అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగగా, బీజేపీ నేత కుమారుడికి మద్దతుగా పలువురు బీజేపీ నేతలు అర్ధరాత్రి మహిళ ఎందుకు బయటకెళ్లిందంటూ ప్రశ్నించారు. దీంతో ఇది మరింత పెను వివాదంగా రూపుదాల్చింది.
ఈ నేపథ్యంలో సీసీ పుటేజ్ లేదని పోలీసులు చెప్పడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీసీ పుటేజ్ సంపాదించిన పోలీసులు, వికాస్ పై కేసు నమోదు చేసి, నేటి ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలంటూ ఆయన నివాసం ముందు గేటుకు నోటీసులు అంటించారు. దీంతో సుబాష్ బరాలా స్పందించి, తన కుమారుడు అనుకున్న సమయానికి పోలీస్ స్టేషన్ కు వస్తాడని చెప్పారు. వర్ణిక తన కుమార్తె లాంటిదని, తప్పు చేస్తే ఎవరైనా శిక్షించబడాలని అన్నారు. అందుకే నోటీసులు అంటించగానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవాలని సూచించానని, మార్గ మధ్యంలో ఉన్నాడని, కాసేపట్లో లొంగిపోతాడని తెలిపారు. అయితే సుభాష్ బరాలా ప్రకటన చేసిన మూడు గంటల తరువాత తీరిగ్గా వికాశ్ బరాలా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం దీనిపై పోలీసులు మాట్లాడుతూ, స్నేహితుడితో పందెం కాసిన వికాశ్ బరాలా...వర్ణికా కుందు కారును వెంబడించాడని, ఆ కారు డ్రైవ్ చేసేది పురుషుడా? స్త్రీనా అన్న సంగతి తెలుసుకునేందుకే అలా వేగంగా ఆమె కారును వెంబడించాడని కొత్త కథనం వినిపించారు. అలా అయితే ఆమె కారును ఎందుకు ఆపాడు? ఆమెను కారు దిగాలని ఎందుకు డిమాండ్ చేశాడు? అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.