: వారం గడచినా సీసీ టీవీ ఫూటేజీ దొరకలేదు.. న్యాయం చేయాలని వేడుకుంటున్న హైదరాబాదీ మహిళ
ఆగస్ట్ 2వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఓ సీనియర్ సిటిజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడచినా, ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మృతుడి కుమార్తె రేణుక తన ఆవేదనను ఓ మీడియాతో పంచుకున్నారు.
పదేళ్లకు పైగా తన తండ్రి యోగా పాఠాలను చెబుతున్నారని... బంజారాహిల్స్ లో ఉన్న యాడ్ లైఫ్ బిల్డింగ్ లో యోగా పాఠాలు చెప్పడానికి ప్రతి ఉదయం మాదాపూర్ లోని తమ నివాసం నుంచి ఉదయం 5 గంటల కంటే ముందే వెళ్లేవారని చెప్పారు. సాధారణంగా క్యాబ్ లో వెళ్లే వారని, కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లేవారని... ప్రమాదం జరిగిన రోజున ఆయన నడుచుకుంటూనే వెళ్లారని తెలిపారు. ఎన్టీఆర్ భవన్ సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు తన తండ్రిని ఢీకొందని... ఈ ఘటనలో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. 20 నిమిషాల్లోనే తాము ప్రమాదస్థలికి చేరుకున్నామని... సరిగ్గా అదే సమయానికి అక్కడకు అంబులెన్స్ వచ్చిందని... వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. తన తండ్రిని పరీక్షించిన డాక్టర్లు ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని కొన్ని నిమిషాల్లోనే తేల్చేశారని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన తండ్రి కార్డియాక్ అరెస్ట్ కు గురై చనిపోయారని తెలిపారు.
అదేరోజు సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తన భర్త ఫిర్యాదు చేశారని... అయితే ప్రమాదం జరిగిన సమయంలో సీసీటీవీ ఫూటేజీ లేదని పోలీసులు చెబుతున్నారని ఆమె వాపోయారు. సిటీలో ఉన్న అత్యంత కీలకమైన జంక్షన్లో సీసీటీవీ ఫుటేజీ లేదని చెప్పడం దారుణమని ఆమె మండిపడ్డారు. జంక్షన్లో ఎన్నో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని... పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని, ఇటువైపు ఉన్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్ద కూడా కెమెరాలు ఉన్నాయని, రోడ్డు మీద ఉన్న ప్రతి షాపు వద్ద కెమెరాలు ఉన్నాయని ఆమె తెలిపారు. తమ సీసీ కెమెరాలు కొన్ని రోజులుగా పని చేయడం లేదని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ సిబ్బంది తెలిపారని చెప్పారు. ఇతర సీసీ కెమెరాల్లో కారు కనిపించలేదని... ఏదో సందులో నుంచి కారు వెళ్లిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం జరిగినప్పుడు కారు నంబర్ ను చూసిన ప్రత్యక్ష సాక్షులెవరైనా ఉంటే సహాయం చేయాలని ఆమె విన్నవించారు. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ, ఇది రెండు, మూడు రోజుల్లో తేలిపోయే వ్యవహారం కాదని, కొంచెం సమయం పడుతుందని చెప్పారు.