: ఇన్స్టంట్ క్రెడిట్ కార్డు సౌకర్యం ప్రారంభించిన ఐసీఐసీఐ... బ్యాంకింగ్ రంగంలో మొదటిసారి!
సేవింగ్స్ అకౌంట్ వినియోగదారులకు ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేకుండా తక్షణమే క్రెడిట్ కార్డు జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సౌకర్యం కల్పించిన మొదటి బ్యాంక్ తమదేనని ఐసీఐసీఐ పత్రికాప్రకటన ద్వారా తెలియజేసింది. అర్హులైన వినియోగదారులు ఆన్లైన్ ద్వారా తమ క్రెడిట్ కార్డు నెంబర్, ఇతర వివరాలు తెలుసుకున్న వెంటనే, వాటిని ఉపయోగించి షాపింగ్ చేసే అవకాశం ఉంటుందని బ్యాంక్ వివరించింది.
ఈ లావాదేవీలకు భౌతికంగా ఎలాంటి కార్డు అవసరం లేదని స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న వివిధ క్రెడిట్ కార్డు ఆప్షన్ల నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుని తక్షణమే తమ క్రెడిట్ కార్డును పొందవచ్చని ఐసీఐసీఐ తెలిపింది. ఈ సదుపాయం ద్వారా రూ. 4 లక్షల వరకు పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం ఈ సదుపాయం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోనే మొబైల్ ద్వారా కూడా ఇన్స్టంట్ క్రెడిట్ కార్డు తీసుకునే సదుపాయం కల్పిస్తామని ఐసీఐసీఐ పేర్కొంది.