: లాలూజీ, మీరు ఒంటరిగా పోరాడలేరు.. మేం చెప్పినట్టు చేస్తే, మీకు మద్దతిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
బీజేపీ అంతు చూసేదాకా నిద్రపోనంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మత శక్తులను ఎదుర్కోవడం అంత సులభం కాదని... బీజేపీని దెబ్బతీయాలంటే మీరు ఒంటరిగా పోరాడలేరని, ఉమ్మడి పోరాటాలు అవసరమని లాలూకు ఒవైసీ సూచించారు. సీమాంచల్ రాష్ట్ర ఏర్పాటుకు మీరు సహకరిస్తే, ఆర్జేడీతో కలసి పని చేయడానికి ఎంఐఎం సిద్ధంగా ఉందని చెప్పారు. బీహార్ నుంచి సీమాంచల్ ను వేరుచేస్తే, అక్కడున్న ముస్లింల జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు. 2015 బీహార్ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతం నుంచి ఎంఐఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఒవైసీ ప్రకటనపై లాలు ప్రసాద్ యాదవ్ ఇంకా స్పందించాల్సి ఉంది.