: భారీ వర్షంతో హైదరాబాద్ వాసులకు నరకం!
హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. ఆఫీసులకు చేరుకునేందుకు ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని నారాయణగూడలో 6, ఆసిఫ్ నగర్ లో 4.2, నాంపల్లిలో 4.2, ఎల్ బీ నగర్ లో 5.4,. అస్మాన్ గడ్ లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లకు పైగానే వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి.
మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు రంగారెడ్డి, యాదాద్రి, జోగులాంబ, మేడ్చల్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ లో వర్షం తగ్గింది. రంగంలోకి దిగిన మునిసిపల్ అధికారులు, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.