: కోట్ల విజయభాస్కరరెడ్డి, చెన్నారెడ్డి లాంటి నాయకులను చూశా.. జగన్ లాంటి డొల్ల నాయకులను ఎన్నడూ చూడలేదు: చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ ను ఆయన కన్నతండ్రి వైయస్సే భరించలేక పోయారని చెప్పారు. ఒకసారి జగన్ ను అమెరికా పంపించారని... అయితే, ఆయన వెంటనే తిరుగు టపాలో వచ్చేశారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ద్వారా తన పదవికే ముప్పు వస్తుందని భావించిన రాజశేఖర్ రెడ్డి... జగన్ ను బెంగళూరుకు పంపించేశారని... ఈ విషయాన్ని సాక్షాత్తు రోశయ్యే తనకు చెప్పారని అన్నారు. జగన్ లాంటి నాయకులు గతంలో ఎవరూ లేరని మండిపడ్డారు.
పుచ్చలపల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి నాయకులను తాను చూశానని... కానీ, జగన్ లాంటి డొల్ల నాయకత్వం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రతి వ్యక్తికి కోపతాపాలు, బాధలు ఉంటాయని... వాటిని నియంత్రించుకునే విధానం ద్వారానే మనలోని వ్యక్తిత్వం బయటపడుతుందని చెప్పారు. పరిటాల రవి, శివారెడ్డిలను చంపినప్పుడు తనకు ఎంతో కోపం వచ్చిందని... అయినా, తాను ఒక్క మాట కూడా తూలలేదని తెలిపారు.