: ప్రపంచానికి ఇండియానే పెద్ద దిక్కు: మోదీ
ప్రపంచమంతా ఇప్పుడు అవకాశాల కోసం ఇండియా వైపు చూస్తోందని లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అగ్ర రాజ్యాలుగా పేరున్న దేశాలు సైతం ఇండియాతో స్నేహం కోసం ముందుకు వస్తున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ వృద్ధికి పెద్దదిక్కుగా ఇండియా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. భారత యువ శక్తి సత్తా అపూర్వమని, వారు తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. సుభాష్ చంద్రబోస్ నుంచి అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వరకూ ఎందరినో నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తోందని, ఓ ప్రధానిగా ఇది తనకు గర్వకారణమని తెలిపారు.
జీవన గమనంలో మంచి జీతం తీసుకునే ఉద్యోగం చేసేందుకు బదులుగా ఉద్యోగాలను సృష్టించే పనులను యువత చేపట్టాలని పిలుపునిచ్చారు. యువతలో చట్టాల అతిక్రమణ పట్ల అవగాహన పెరిగిందని, సమాజంలోనూ చట్ట నిబంధనలను పాటించడం పెరుగుతోందని ఇది శుభ పరిణామమని తెలిపారు. మిగతా విభాగాల మాదిరిగానే రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా యువత ఆసక్తిని చూపాలని మోదీ కోరారు. భరతమాత ముద్దుబిడ్డలు ఇప్పుడు ఎన్నో దేశాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు.
దేశ ప్రజలంతా కలసి కట్టుగా నడిస్తే, భారతావని కంటున్న కలలు సాకారం కావడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. 1942 నుంచి 1947 మధ్య యువత స్వాతంత్ర్యం కోసం ఎలా ఉద్యమించిందో, 2017 నుంచి 2022 వరకూ అదే స్ఫూర్తిని చూపించి దేశాభివృద్ధికి యువత కృషి చేసి, ఇప్పుడు కంటున్న కలలను నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2022 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న తన కోరికను నెరవేర్చేందుకు, తనతో పాటు ముందడుగు వేయాలని నరేంద్ర మోదీ కోరారు. ఈ ప్రయాణంలో జీఎస్టీ అమలు నుంచి తాము తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు తోడుగా నిలుస్తాయని తెలిపారు.