: రాంవీర్ మా పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది: బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్
హర్యానాలో బీజేపీ నేత కుమారుడు ఓ ఐఏఎస్ కూతురును వేధించిన ఘటనలో `రాత్రుళ్లు ఆడవాళ్లకు బయట ఏం పని?` అని మాట్లాడిన బీజేపీ ఎంపీ రాంవీర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, నటి కిరణ్ ఖేర్ ఘాటుగా స్పందించారు. రాంవీర్ తమ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని, అసలు అమ్మాయిల గురించి అలా మాట్లాడటానికి రాంవీర్‌కి నోరెలా వచ్చిందని ఆమె మండిపడ్డారు.
`రాత్రివేళల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? పగలు ఎందుకు జరగడం లేదు? ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అమ్మాయిల్ని కాదు, అబ్బాయిల్ని` అంటూ కిరణ్ ఆగ్రహంతో సమాధానమిచ్చారు. హర్యానాలో ఐఏఎస్ కూతురు వర్ణికను బీజేపీ నేత సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా రాత్రిపూట ఆమె కారును వెంబడించి వేధింపులకు గురిచేశాడు. ఈ కేసులో ఐదు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఒక నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీ రాంవీర్ చేసిన వ్యాఖ్యలకు బాధితురాలు వర్ణిక కూడా ఘాటుగానే స్పందించింది. తాను ఎక్కడికి వెళ్లినా ఇతరులకు అనవసరమని, ఈ ఘటనలో తాను బాధితురాలినే కానీ నిందితురాలిని కాదని ఆమె బదులిచ్చింది.