: ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌ని పోలీసులకు వినూత్న రీతిలో గుణ‌పాఠం చెబుతున్న రాజ‌కీయ నేత‌


హైద్రాబాద్‌కు చెందిన మ‌జ్లిస్ బ‌చావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మ‌ద్ ఉల్లా ఖాన్ ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌ని పోలీసుల‌కు వినూత్న రీతిలో గుణ‌పాఠం చెబుతున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వాళ్ల భ‌ర‌తం ప‌డుతున్నారు. నిబంధ‌న‌లు సామాన్యుల‌కేనా? పోలీసుల‌కు కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బండి న‌డుపుతున్న పోలీసుల‌ను, రాంగ్ పార్కింగ్ చేసిన పోలీసు వాహ‌నాల‌ను ఫొటోలు తీసి ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ పోస్టుల్లో తెలంగాణ డీజీపీ, హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ల‌ను ట్యాగ్ చేసి పోలీసులు పాల్ప‌డుతున్న ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌లు వారికి చేర‌వేస్తున్నారు. ఈ పోస్టులతోపాటు `మీరు బోధించేది...మీరు పాటించండి` అని సందేశం కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉండ‌గా తాను చేస్తున్న పనిని చాలా మంది నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నార‌ని, త‌న వాట్సాప్‌కి రోజుకి 300 దాకా ఫొటోలు పంపిస్తున్నార‌ని అజ్మ‌ద్ తెలిపారు. తాను ఒంట‌రిగా ప్రారంభించిన ఈ ప్ర‌చారంలో ఇప్పుడు చాలా మంది భాగ‌స్వాముల‌య్యార‌ని ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News