: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సన్వర్ లాల్ కన్నుమూత
గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొని, కుప్పకూలిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సన్వర్ లాల్ జాట్ ఈ ఉదయం కన్నుమూశారు. తొలుత ఆయన్ను జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన కుటుంబీకులు, పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయని స్థితిలో ఆయన మరణించినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. 1955 జనవరి 1న జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఎంకామ్, పీహెచ్డీ చేసి, వర్శిటీ ప్రొఫెసర్ గా పని చేసిన ఆయన, రాజస్థాన్ మంత్రిగా, 2014 నుంచి 2016 వరకూ కేంద్ర జల వనరుల శాఖ సహాయమంత్రిగా పని చేశారు. సన్వర్ లాల్ మతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా తదితర పార్టీ నేతలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.