: హైదరాబాద్ మెట్రో పరుగుకు డేట్ ఫిక్స్.. జనవరి 3న మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. తొలి విడత రెండు కారిడార్లలో కూత!


భాగ్యనగర వాసుల కల ఫలించబోతోంది. హైదరాబాద్ మెట్రో రైలు పరుగుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కూతకు రెడీ అవుతోంది. తొలుత రెండు కారిడార్లలో ప్రారంభం కానున్న మెట్రో సేవలను క్రమంగా విస్తరించనున్నారు. జనవరి 3న  ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారు. నాగోల్-బేగంపేట, మియాపూర్-అమీర్‌పేట కారిడార్లలో తొలుత మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైలును ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కారణంగానే నగరంలో పనులు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేసి, ట్రాఫిక్‌ను మళ్లించి మరీ రాత్రీపగలు తేడా లేకుండా పనులు చేస్తున్నారు. అమీర్‌పేట, సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ను దారి మళ్లించి పనులు పూర్తి చేస్తున్నారు. ఒలిఫెంటా వద్ద  ఏర్పాటు చేస్తున్న ఉక్కు వంతెన నిర్మాణం పూర్తయితేనే నాగోలు నుంచి బేగంపేట మార్గంలో రైలు నడిపే అవకాశం ఉంది.

నవంబరు కల్లా మిగిలిన పనులు పూర్తి చేసి డిసెంబరులో ట్రయల్స్ నిర్వహించి జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమీర్‌పేట వద్ద రైలు మార్పిడి స్టేషన్ నిర్మించాల్సి ఉంది. దీని నిర్మాణాన్ని కొనసాగిస్తూనే మియాపూర్-అమీర్‌పేట మధ్య రైలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, నగరంలోని మిగతా రూట్లలోనూ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం మూడు కోచ్‌లతో ఉన్న 53 మెట్రో రైళ్లు నగరానికి చేరుకున్నాయి. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ప్రధాని  నరేంద్రమోదీని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News