: 331 డొల్ల కంపెనీలపై సెబీ కొరడా?
331 డొల్ల కంపెనీలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొరడా ఝళిపించింది. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ డొల్ల కంపెనీలుగా అనుమానిస్తూ వెల్లడించిన జాబితాను సెబీ విడుదల చేసింది. ఆ జాబితాలోని 331 కంపెనీల లావాదేవీలను నెలరోజులపాటు బ్లాక్ లో పెట్టాలని బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈ, మెట్రపాలిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ లకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. నెలలో కేవలం ఒక్క రోజు మాత్రమే ట్రేడింగ్ కు అవకాశం ఉండే స్టేజ్-4 గ్రేడెడ్ సర్వైలెన్స్ మెజర్ (జీఎస్ఎం) లో ఈ కంపెనీలను చేర్చాలని సెబీ ఆయా ట్రేడింగ్ సంస్థలకు సూచించింది. ఈ కంపెనీలపై అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఒక్కసారిగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ షేర్లు పడిపోయాయి.