: రూ. 13 లక్షల స్కౌట్ బాబర్ బైక్ బుకింగ్స్ షురూ!
12 నుంచి 13 లక్షల రూపాయల ఖరీదైన స్కౌట్ బాబర్ బైక్స్ బుకింగ్స్ ప్రారంభించినట్టు అమెరికా తొలి మోటార్ సైకిల్ కంపెనీ ‘ఇండియన్ మోటార్ సైకిల్స్’ ప్రకటించింది. సెప్టెంబర్ నాటికి భారతీయ రోడ్లపై పరుగులు పెట్టే ఈ బైక్ బుకింగ్ కోసం టోకెన్ ధరగా 50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ బైక్ లో ప్రత్యేకతల వివరాల్లోకి వెళ్తే...1,133 సీసీ సామర్థ్యంతో లిక్విడ్ కూల్డ్, థండర్ స్ట్రోక్ 111 వి-ట్విన్ ఇంజన్ అమర్చారు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉండడంతో ఇది గరిష్టంగా 100 బిహెచ్‍పి పవర్ మరియు 97.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్స్, డిజిటల్ వెర్షన్ కలిగి ఉండడంతోపాటు ఒక్కరే ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. బైక్ డిజైన్ వాహన ప్రియులను ఆకట్టుకోనుందని ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థ చెబుతోంది. ఈ బైక్ భారత్ మార్కెట్ లో ఆదరణ పొందుతున్న ట్రైంఫ్ బోన్నెవిల్లే బాబర్, మోటో గుజ్ వీ9 బాబర్, హార్లే డేవిడ్సన్ ఫార్టీ ఎయిట్ బైక్ లకు గట్టి పోటీ ఇస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.