: స్మార్ట్ ఫోన్ వ్యసనం భవిష్యత్ తరాలకు ముప్పు: పరిశోధన
స్మార్ట్ ఫోన్ వ్యసనం భవిష్యత్ తరాలకు పెను ముప్పుగా మారనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... ట్వెంజ్ అనే అమెరికా పరిశోధకురాలు స్మార్ట్ ఫోన్ వినియోగం- సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు అంశంపై పరిశోధనలు చేశారు. ఇందులో గత 25 ఏళ్లుగా తరాల వారీగా సమాజంలో చోటుచేసుకున్న మార్పులను ఆమె వివరించారు. ప్రస్తుత యువతరానికి స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యసనం వారిని పనికిరానివారిగా తయారు చేస్తూ, వారి విలువైన సమయాన్ని తినేస్తోందని తెలిపారు.
ప్రస్తుత యువతరం గత తరాల ప్రజల్లా సంతృప్తికరమైన జీవన విధానాన్ని ఆస్వాదించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2000-2015 మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కారణంగా స్నేహితులతో గడిపే వారి సంఖ్య 40 శాతానికి పడిపోయిందని ఆమె తన పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు. దీని కారణంగా ఒంటరితనం అనుభవిస్తున్నారని, తద్వారా స్మార్ట్ ఫోన్ మైకంలో పడిపోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇది తీవ్రమైన దుష్పరిణామాలకు కారణమని ఆమె తెలిపారు.