: పాక్ లో ప్రాసిక్యూటర్ దుర్మరణం.. ముంబయి పేలుళ్ళ అనుమానితులపై విచారణ వాయిదా
ముంబయి తీవ్రవాద దాడులకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు చేపడుతున్న విచారణ ఈనెల 18కి వాయిదాపడింది. ఈ కేసులో చీఫ్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తున్న చౌధరీ జుల్ఫికర్ అలీని ఇస్లామాబాద్ లో నిన్న ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని సాయుధులు కాల్సి చంపారు. అలీ తాజాగా బేనజీర్ భుట్టో హత్య కేసునూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో మాజీ అధ్యక్షుడు ముషారఫ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయి దాడుల విచారణను వాయిదా వేయాలని పాక్ దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూటర్లు తీవ్రవాద వ్యతిరేక కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో, కేసు విచారణను పక్షం రోజులు వాయిదా వేస్తూ న్యాయమూర్తి హబీబ్-ఉర్-రహ్మాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముంబయిలో 2008లో చోటు చేసుకున్న ఉగ్రదాడులకు సంబంధించి పాక్ లో ఏడుగురిని అనుమానితులుగా భావిస్తున్నారు. వారిలో లష్కరే తోయిబా కమాండర్ జకీయుర్ రహమాన్ లఖ్వీ కూడా ఉన్నాడు. అప్పట్లో ఈ ఘటనలో 166 మంది మరణించారు.