: డబ్బాలో ఉప్మా ఉందని చెప్పారు.. వెతికితే కళ్లు చెదిరిపోయాయి!
ఉప్మా బాక్స్ ను వెతికితే, భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడిన ఘటన పూణె ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పూణె ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లబోతున్న ఇద్దరు వ్యక్తులపై ఓ ఇమ్మిగ్రేషన్ అధికారికి సందేహం వచ్చింది. వారిని కొన్ని ప్రశ్నలు అడగ్గా, వారిచ్చిన సమాధానాలు అనుమానాలను మరింతగా పెంచాయి. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు సదరు అధికారికి సరైనవిగా అనిపించలేదు. దీంతో, ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ సిబ్బందికి ఆయన సమాచారం అందించాడు.
వెంటనే వీరిద్దరి చెకిన్ లగేజీని సెక్యూరిటీ సిబ్బంది తనఖీ చేశారు. అందులో ఒక పెద్ద హాట్ కేస్ ఉంది. అందులో ఏముందని ప్రశ్నిస్తే... ఉప్మా ఉందని సదరు వ్యక్తులు సమాధానమిచ్చారు. అయితే ఉప్మా డబ్బా అంత బరువు ఎందుకు ఉందనే డౌట్ రావడంతో... దాన్ని ఓపెన్ చేసి చూశారు. అందులో రూ. 1.29 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ కనపడేసరికి అధికారులు షాక్ అయ్యారు. ఉప్మా డబ్బాలోని ఒక నల్లటి పాలిథిన్ కవర్లో 86,600 అమెరికన్ డాలర్లు... 15,000 యూరోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.