: బాబ్రీ వివాద స్థలానికి కొద్దిదూరంలో మసీదు నిర్మించుకోవచ్చు: సుప్రీం కోర్టుకు తెలిపిన షియా బోర్డు
దశాబ్దాలుగా కొనసాగుతున్న బాబ్రీ మసీదు కూల్చివేత వివాదంలో షియా బోర్డు తమ అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు విన్నవించింది. వివాద స్థలానికి కొద్దిదూరంలో మసీదు నిర్మించుకోవచ్చని వారు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. రామ మందిరం, మసీదులు ఒకే చోట ఉంటే ఘర్షణ కొనసాగుతుందని, ఈ వివాదంలో అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు ఇవ్వాలని షియా బోర్డు, సుప్రీంకోర్టును కోరింది. దీనికి సంబంధించి ఆగస్టు 11న విచారణ జరగనుంది.
1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు నిర్మించిన ప్రదేశం శ్రీరాముని జన్మస్థలమని కొంత మంది హిందూవాదులు మసీదును కూల్చివేశారు. ఈ పని భారత రాజకీయాల రూపురేఖలు మార్చేసింది. దీనికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులోనే ఉంది. 2010లో వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా చేసి తీర్పునిచ్చింది. ఆ భాగాలను రామ్ లల్లా, నిర్మోహి అఖడ, సున్నీ వక్ఫ్ బోర్డులకు పంచింది. తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన భాగం తమకు చెందుతుందని షియా వక్ప్ బోర్డు వాదిస్తున్న సంగతి తెలిసిందే.