: ఆస్ట్రేలియా బాలుడిని ఆసుపత్రి పాలు చేసిన సముద్రపు పురుగులు!
ఫిరానా పురుగులను పోలిన చిన్నచిన్న సముద్రపు పురుగులు ఆస్ట్రేలియాలో కనిపించాయి. ఇవి ఫిరానాల్లా మనుషులపై దాడి చేయవు, కాకపోతే సముద్రంలోని జంతు, వృక్ష పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో తోడ్పడేవేనని సముద్రజీవ శాస్త్రవేత్తలు తెలియజేశారు. మెల్‌బోర్న్‌కు చెందిన సామ్ కనీజే ఈ పురుగుల దాడికి గురై ఆసుపత్రి పాలు కావడంతో ఈ పురుగుల గురించి వెలుగులోకి వచ్చింది.
అక్కడి బ్రింగ్టన్ బీచ్‌లో 30 నిమిషాలపాటు గడిపిన సామ్ కాళ్ల నుంచి తీవ్రరక్త స్రావం జరిగింది. అలా రక్తంతో తడిసిన కాళ్లతో ఇంటికెళ్లిన సామ్‌ను చూసి అతని తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లినా రక్తస్రావానికి కారణమేంటో వైద్యులు కనిపెట్టలేకపోయారు. అతని కాళ్ల మీద చిన్న చిన్న రంధ్రాలు ఉండటం చూసి అతని తండ్రి జారోడ్ సముద్రం వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ ఉన్న చిన్న చిన్న పురుగులను చూసి, తన కుమారుడి గాయాలకు ఇవే కారణమై ఉంటాయని వాటిని పట్టుకొచ్చాడు. తర్వాత వాటిని పరిశోధన కోసం సముద్రజీవ శాస్త్రవేత్తలకు పంపించాడు. ప్రస్తుతం సామ్ కోలుకుంటున్నాడని జారోడ్ తెలిపాడు.