: ‘రాహుల్ కనబడటం లేదు.. ఆచూకీ తెలిపితే నజరానా’ అంటూ యూపీలో పోస్టర్లు
ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కనబడటం లేదని, ఆయన ఆచూకీ తెలిపితే నజరానా అందిస్తామని ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగి గెలిచిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని నెలల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో రాహుల్ అవమానంగా భావించి అమేథీకి రావడం లేదని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇలా వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. తమ ఎంపీ రాహుల్‌గాంధీ కనబడటంలేదంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. రాహుల్ అమేథీకి వచ్చి ఆరు నెలలు అవుతోందని మండిపడుతున్నారు. రాహుల్ తీరు బాగోలేదని, ప్రజలు ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని కూడా ఆ పోస్టర్లలో రాశారు. తమ ప్రాంతంలో ఎంపీ ల్యాడ్స్ కింద జరగాల్సిన అభివృద్ధి పనులు వేగంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పోస్టర్లను ఆ ప్రాంత ప్రజల పేరిట ఎవరు ముద్రించారో తెలియరాలేదు. అయితే, ఈ పోస్టర్ల వెనుక తమ ప్రత్యర్థి పార్టీ నేతల హస్తం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.