: తన ఉద్యోగులలో క్రీడలను ప్రోత్సహించనున్న ఫ్లిప్ కార్ట్... ప్రతిభావంతులకు లక్షల్లో ఆర్థిక సాయం!
ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు జాతీయ లేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొనేందుకు ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. 'బడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్' పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో తమ ఉద్యోగులు పాల్గొనవచ్చని తెలిపింది. ఆయా ఈవెంట్లలో పాల్గొనే తమ ఉద్యోగులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. తమ సంస్థలో 6 నెలలకు పైగా పనిచేస్తోన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఆసక్తిగల తమ ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఇంటర్నల్ కంపెనీ ప్యానల్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. తమ ఉద్యోగులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికే తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సాయం స్థానిక లేక రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వర్తించబోదని చెప్పింది. సర్కారు నిర్వహించే దేశీయ, అంతర్జాతీయ స్థాయి ఆటల్లోనే కాకుండా నాన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనేందుకు కూడా తమ ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది.