: `అమ్మాయిలు టెక్కీలుగా పనికిరారు` వివాదంపై స్పందించిన గూగుల్ సీఈఓ!
గూగుల్‌లో పనిచేసే ఓ పురుష ఇంజినీరు `సాంకేతిక ఉద్యోగాలకు అమ్మాయిలు పనికిరారు` అంటూ ఈ-మెయిల్ ద్వారా పంపిన మెమో గూగుల్ ఉద్యోగుల్లో దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా ఉద్యోగుల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ దుమారాన్ని సద్దుమణిగించడం కోసం ఆయన తన ఫ్యామిలీతో గడుపుతున్న విహారయాత్రను మధ్యలో కుదించుకుని వచ్చేశారు.
గూగుల్‌లో ఎలాంటి లింగభేదం చూపించడం లేదని చెబుతూ ఈ వివాదంపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి వివాదాలు కంపెనీ నైతిక విలువలకు హాని చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మాటలు ప్రచారం చేస్తున్న ఉద్యోగిని తొలగించాలని కొంతమంది ఉద్యోగులు కోరారు. అలాగే మరికొంత మంది ఉద్యోగులు ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు. ఉద్యోగిని తొలగించే విషయం గురించి సుందర్ పిచాయ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇతర ఉద్యోగులను తప్పుదోవ పట్టించి, కంపెనీకి చెడ్డపేరు తీసుకువచ్చిన ఉద్యోగిని తొలగించాలని కంపెనీ నియమాల్లో ఉందని ఓ మహిళా ఉద్యోగి పేర్కొన్నారు.