: త్వరలో అమెజాన్ వారి సూపర్ మార్కెట్.... ఆన్‌లైన్‌లోనూ అమ్మకం!
బిగ్ బజార్ తరహాలో నిత్యావసరాలు, ఆహార పదార్థాల అమ్మకాలను త్వరలో అమెజాన్ ప్రవేశపెట్టనుంది. ఆన్‌లైన్‌తో పాటు, బయట స్టోర్ల ఏర్పాటుతో ఈ అమ్మకాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళికి ఆన్‌లైన్‌లోనూ, బయట రిటైల్ స్టోర్ల ద్వారా తన అమ్మకాలను అమెజాన్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అమెజాన్ వారికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించినట్లు చెబుతున్నారు.
అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ అమ్మకాలు చేపట్టనుంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 500 మిలియన్ డాలర్లను అమెజాన్ ఖర్చుచేయనుంది. స్థానికంగా ఉత్పత్తి చేసి, తయారు చేసిన పదార్థాలను తమ బ్రాండ్ పేరుతో అమెజాన్ విక్రయించనుంది. ప్రస్తుతం బిగ్‌బజార్, హైపర్సిటీ వంటి సూపర్ మార్కెట్లతో కలిసి అమెజాన్ నౌ, అమెజాన్ పాంట్రీ సర్వీసుల ద్వారా ప్రముఖ నగరాల్లో నిత్యావసరాలను అమెజాన్ విక్రయిస్తోంది. ఇక ప్రత్యేకంగా తమ బ్రాండ్‌తో అమెజాన్ అమ్మకాలు ప్రారంభిస్తే, మిగతా రిటైల్ వ్యాపారస్తులకు భారీనష్టం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.