: ఇకపై మరింత జాగ్రత్త... భారత క్రికెట్ దిగ్గజాలను భయపెట్టిన లంక కుర్రాడు!
రెండు రోజుల క్రితం శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందన్న విషయంలో మూడో రోజే నమ్మకం కలిగినా, క్రికెట్ లోని అసలు మజా నాలుగో రోజు తెలిసొచ్చింది. భారత క్రికెట్ దిగ్గజాలకు సరికొత్త భయాన్ని కలిగిస్తూ, ఓ కుర్రాడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, వారి చమటతో కొలంబో మైదానాన్ని తడిపించాడు. అతనే కుశాల్ మెండిస్!
తొలి ఇన్నింగ్స్ లో 622 పరుగులు చేసి, ఆపై లంకను 183 పరుగులకే ఆలౌట్ చేసి, ఫాలో ఆన్ ఇచ్చిన భారత్, గెలుపు అత్యంత సునాయాసమే అనుకొంది. కానీ, అక్కడే పరిస్థితి మారింది. ఒక వికెట్ పడిన తరువాత వచ్చిన కుశాల్ మెండిస్ అద్భుత రీతిలో భారత స్పిన్నర్లకు కళ్లెంవేసి కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డాడు. భవిష్యత్తులో తాను ఓ క్రికెట్ స్టార్ గా మారనున్నానని, భారత స్పిన్నర్లను ఎదుర్కోగలనని నిరూపించాడు.
ఓ వైపు నుంచి అశ్విన్, మరో వైపు నుంచి జడేజా దాడికి దిగితే, వారి బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. ముఖ్యంగా స్వీప్ షాట్లతో మెండిస్ బంతిని బౌండరీలకు తరలిస్తుంటే, ఆత్మరక్షణలో పడ్డ భారత ఆటగాళ్లు, బౌండరీ లైన్ వద్దే కాపుకాయాల్సి వచ్చింది. ఓ ప్రణాళికా బద్ధంగా బంతి టర్న్ లేదా బౌన్స్ కావడానికి ముందే తన బ్యాటుతో బాదేస్తున్న మెండిస్ ఆటతీరు కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లను కూడా మాయలో పడేసింది.
17 బౌండరీలు చేసిన మెండిస్ 8 స్వీప్ షాట్లను ఆడటం సచిన్, గూచ్, ఆండీ ఫ్లవర్ వంటి క్రికెట్ దిగ్గజాలను గుర్తుకు తెచ్చింది. మొత్తానికి ఈ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం సాధించిందని ఎంతగా చెప్పుకున్నా, చివరి కొన్ని గంటలు మాత్రం మైదానంలో మెండిస్ పులిలా విరుచుకుపడ్డాడు. అతను ఆడుతున్న తీరుకు, కొడుతున్న షాట్లకు తానెంతో ఆశ్చర్యపోయానని స్వయంగా కోహ్లీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక మహేల, సంగక్కార వంటి క్రికెటర్ల వారసుడిగా మెండిస్ నిలుస్తాడని భావిస్తున్నారు లంకేయులు. 21 ఏళ్ల మెండిస్ సుదీర్ఘకాలం క్రికెట్ ఆడి అలరిస్తాడని నమ్ముతున్నారు.