: మోదీ కొత్త వరం... డిగ్రీ చదివే ముస్లిం యువతికి రూ. 51 వేలు!
దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్ లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలేనని, మరిన్ని వివరాలు ఎంఏఎఫ్ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కాగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంఏఎఫ్ఈ, ముస్లిం బాలికల్లో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తూ, 90 శాతానికి పైగా బాలికలకు ఆర్థిక సాయం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఇంటర్ వరకూ చదివిన ముస్లిం బాలికలకు రూ. 12 వేల చొప్పున స్కాలర్ షిప్ లను ఎంఏఎఫ్ఈ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 9, 10వ తరగతి చదువుతున్న బాలికలకు రూ. 10 వేలు అవార్డుగా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు ఎంఏఎఫ్ఈ ట్రెజరర్ షకీర్ హుస్సేన్ అన్సారీ వెల్లడించారు. రూ. 51 వేల సాయంపై త్వరలోనే మోదీ స్వయంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.